Tuesday, November 26, 2024

స్వామి తలంపు . . .



అమ్మ ఒడిలో తలపెట్టి ఆదమరచినట్టు,
భుజంపై నాన్న చేయి వేసి నిమిరినట్టు,
వేలు పట్టి ఆళి తోడు నిలుచునట్టు,
స్వామి తలంపు హాయి నిండిన తేనె పట్టు!

పిల్లల పలుకులతో అలసట ఆవిరైనట్టు,
స్నేహితుని ఆలింగనంలో సేదతీరినట్టు,
పెద్దల సూచనలలో ధైర్యము పాదువేసినట్టు,
స్వామి తలంపు సకలబలములకు ఆయువుపట్టు!

తోబుట్టువుల తోడులో బాల్యము తిరిగొచ్చినట్టు,
తనవారు తరలివచ్చి తగుబలము జేర్చినట్టు,
గురు కృపతో స్థితిగతులు సరిదారి పట్టినట్టు,
స్వామి తలంపు ఆపదల కడలికి ఆనకట్టు!

ప్రశాంత మదిన అలజడి అదృశ్యమైనట్టు,
ప్రేమహృదిన ప్రభల భేదము బాయునట్టు,
భజన భావమున భక్తి వర్షము కురియునట్టు,
స్వామి తలంపు సర్వసిరులకు వేల్పుచెట్టు!

No comments: