Saturday, October 31, 2020

పురవీధులలో పైరగాలి



పుడమిలో నాటేను అపురూపంగా ఓ విత్తనం,

ఒడలు వత్తిగా, చమట చమురుగా చేసేను పెత్తనం,

మన్ను దున్నేను నిలవాలని వెన్నుతో తన కలలన్నీ,

పసిడి దీపమై వెలగాలని తనవారి బ్రతుకులన్నీ,


కరువుబరువు చీడపీడ వ్యయవయో భారాలని,
ఒడుపుగా ఓర్పుగా ఒకపరి తన చాట చెరగగలదని,
వడ్లలో వినయం, మినుములలో మర్యాద గట్టిగా మూటకట్టి,
స్వేదరత్నాలకై పయనమయ్యే రైతన్న పురము బాటపట్టి,

అక్షరాన్ని సాగుచేయుట తక్షణ కర్తవ్యమని,
అలనాటి అథమస్మృతులు తిరిగి దరికి రారాదని,
కండ లేదు, అండ లేదు, నమ్మేను స్వీయ మస్తకాన్ని,
పెన్నుపట్టి దున్నేను తెల్లని కాగితాల పుస్తకాన్ని,

దశాబ్దాల దండయాత్ర పూదండలనొసగు కొలువులకై,
తాను కూడా తవ్వేను అవనిని అంబరమంటు భవంతులకై,
పల్లెలో తనవారినొదలి, ప్రేమముదిత మనస్సునొదలి,
పట్టణాన పాటుపడే ప్రవాసికి ఇదేగా ప్రగతి మజిలీ, 
 
అల్పమేది? స్వల్పమేది? బ్రతుకు బడిన సుఖతల్పమేది?
మన్నులో నిద్రించునాడు ధర్మ శిల్పమే వెంటవచ్చునది,
సమన్వయం, సర్దుబాటులు సరళ జీవన సారంశం,
అదిమిపట్టి పాటించిన రంగుల జగతి మనవశం.

----------------------------------------
for TANA competitions


Thursday, April 23, 2020

జిహ్వ - The Tongue

అమృతము కురిపిస్తుంది,
అనృతము గుప్పిస్తుంది,
ఏమిది? అని అడుగగా,
నీ మనోబింబమేగా నేనంటుంది!

మెత్తని పలుకులే మణిపూసలు,
హత్తుకొని ఓదార్చే ప్రియబాసలు,
ఊరినే మంచి చేయు పొలిమేరలు,
పెడుదామా అదుపులో మనమాటలు?

కమ్మని వంటకై పరితపిస్తుంది,
టన్నులైనా స్వాహా నిబ్బరంగా చేస్తుంది,
ఏమిది? అని అడుగగా,
నీ చాపల్యమేగా నేనంటుంది!

కోరికలు కొను కష్టాలు కోకొల్లలు,
మూటాముల్లె పెరిగిన పలు తిప్పలు,
పెట్టెనైనా, పొట్టనైనా పోగేసిన బండారము,
సాగలేము జీవితాన బహు దూరము!

(for సాహితీ శ్రేష్ఠులు writers group)

Thursday, April 9, 2020

జలం - Water

అనంత విశ్వాన ప్రాణానికి పునాదిని నేనే,
అమ్మ గర్భాన తేలియాడిన నీ ఉయ్యాలా నేనే,

సముద్రాన ముద్రించిన వానచినుకును నేనే,
మోటరేసి మోసుకొచ్చిన పలుకరించేది నేనే,

కనుల వెనుక నేనే, కలువలు కొలువైన కొలనంతా నేనే,
అలల నిండా నేనే, వలన చిక్కు చేపల కలల సౌధం నేనే,

దేహంలో నేనే, దాహానికి తాయత్తుని నేనే,
నావ మార్గం నేనే, శ్రామికుని చెమట చుక్కా నేనే,

దొరలు కాచిన వజ్రాన్ని నేనే, రైతన్న అపురూపాన్నీ నేనే,
వేదమందున నేనే, నీవు మ్రొక్కు మందిరమందూ నేనే,

అయ్యో! వృద్ధాశ్రమ ప్రాప్తికున్నానే, నేడు నీ శ్రద్ధ కోరుతున్నానే,
చరిత్రంతా చుట్టివచ్చానే, నీ మనవళ్ళను చూడాలనుకున్నానే!

(for సాహితీ శ్రేష్ఠులు writers group)

Tuesday, March 31, 2020

చద్దన్నం-ఒక సిద్ధాంతం

వంటలోని మసాలాలు పెరిగే,
ఇంటన బంధాలు సన్నగిల్లే,
రంగురంగుల గా మారే బాహ్యం,
నల్ల రంగు మిగిలే అంతర్ముఖం!

మంచి- మాటల వరకే పరిమితం,
వేపను దాటే చేతల్లోని చేదుదనం,
మారిపోయే సంస్కారం  సంప్రదాయం,
ఫోటోలకే పరిమితం ముచ్చటైన ఆహార్యం!

చద్దన్నం, చక్కదనం పర్యాయాలు,
పలికావో తలుపు తట్టు అవహేళనలు,
ఎవడి రుచి వాడిదే ఈ కాలంలో,
తుమ్మితే పోయే సిద్ధాంతాల తరుణంలో!

చద్దన్నం హితం పిజ్జా రుచి భరితం,
పాతది రోతకాదు కొత్తదంతా సరికాదు,
తెలివైనవాడు చేయు బేరము ఆచితూచి,
ఎవరికి వారే పరుచుకోవాలి జీవితాన ఎర్రతివాచీ!

(for సాహితీ శ్రేష్ఠులు writers group)


Monday, March 9, 2020

చేయూత (Anatomy of Assistance)

నూతిలోని నీరును పైకి తెచ్చు చిన్న చేద,
ఛాతిలోని ధైర్యాన్ని తట్టిలేపు ఓ వీర గాథ,
దాగివున్న తిమిరాన్ని త్రోలివేయు శ్రీ గురుబోధ,
ప్రపంచాన ఉపకారుల చేయూతదేగా ఈ కథ!

మన్నులోని విత్తులను మొలకించు రవికిరణం,
అడగదు ఎన్నడూ తన సాయానికి ఏ ఫలం,
మూడునాళ్ళేగా మన ఈ భువి పయనం,
మరి కోరుతామెందుకు మూడెకరాల శిలాఫలకం?

అడగకున్న అందించుదాం ఆత్మీయపు ఆసరా,
మనవర్ణనకొస్తే స్ఫురించాలి ఓ పూలవసారా,
కాలచక్రం తిరుగుతోంది ఆగకుండా గిరగిరా,
మరి కోపాలకి, పంతాలకి సమయమేది సోదరా?

(for సాహితీ శ్రేష్ఠులు writers group)

Saturday, March 7, 2020

చెరువు కథ ( Story of a Pond)

విలసిల్లే నాడు మా ఊరి మా చెరువు,
చెంతనే ఉండగా పశుపక్షులు తరువు,
జాతరలు,ఈతలు మరెన్నెటికో  నెలవు,
స్నేహాలు విరిసేటి ఎన్నో కబుర్ల కొలువు!

గ్రామానికే బొట్టులా కళకళలాడే  చెరువు,
సాకింది తరాలను లేకుండా ఏ బరువు,
పుష్కలానికి ప్రతిరూపం మా వరాల తరువు,
నేర్వలేదు ఎవ్వరూ ఈ పదం - కరువు!

కల్పవల్లి నేడు అనిపించేను నిష్ఫలము,
భూభస్మాసురులకు ఎదురులేని కాలము,
పంపు పైపులతో పీల్చేము భూగర్భజలము,
పోగిడు శాపాల మూట ఎలా మోయగలము?

(for సాహితీ శ్రేష్ఠులు writers group)

Wednesday, March 4, 2020

చైత్రంతో సంభాషణ (Conversation with Spring)

అడిగాను నేను చైత్రాన్ని,
ఎందుకింత ఆత్రమని?
అందరికన్నా ముందున్నావనా?
అంతా నీతో మొదలవుతుందనా?

అడిగాను నేను చైత్రాన్ని,
ఇచ్చిందెవరు ఇంత ధైర్యాన్ని?
వెనకున్న పదకొండు మాసాలనా?
నీవు రాక అవి రాలేవనా?

అడిగాను నేను చైత్రాన్ని,
ఎక్కడిదింత  సోయగమని?
కోకిల పాట కలిగున్నావనా?
పచ్చని పూత నీదేననా?

అడిగాను నేను చైత్రాన్ని,
ఎందుకింత అభిమానమని?
తియ్యని మావి ఇస్తావనా?
పిల్లల సెలవులు తెస్తావనా?

"ఔను నేను మీ చైత్రాన్ని,
వెచ్చని కాంతుల పల్లకిని,
మానవాళికి మరో ఉదయాన్ని,
ఉగాదిని మ్రోయు పునాదిని."

(for సాహితీ శ్రేష్ఠులు writers group)

Thursday, February 27, 2020

గాలి (Air)

అనాది నుండీ నీ గమనం,
అలుపేలేని ఈ పయనం,
ఎంతైననూ పని భారం,
ఆగదుగా నీ ఉత్సాహం!

చిరు ప్రాయానికే ఓ అందం,
బూర, గాలిపటాల అనుబంధం,
పెద్దయ్యాక కనబడదేం?
నేర్చిన గాలిపాఠాల సంకేతం!

మల్లెల గంధం మోస్తావు,
మురుగును సైతం భరిస్తావు,
కర్తవ్య కర్మని తరిస్తావు,
గీతాసారాన్ని కురిపిస్తావు!

అందరిలో నీవున్నావు,
స్థాయి అంటదన్నావు,
అంతలోనే వెడలిపోయేవు,
కథ కంచికని చెప్పేవు!

మర్మము గ్రహించి సాగాలి,
మనస్సున నీ పాట మ్రోగాలి,
ఎల్లలు లేని ఈ గాలి,
అన్నది - ఎందుకు నేను ఆగాలి?

(for సాహితీ శ్రేష్ఠులు writers group)

Monday, February 24, 2020

గడప (Threshold)

నాది నీది నడుమ ఓ సన్నని సరిహద్దు,
ఉన్నాడుగా సైనికుడు కాపలాగా ఏ పొద్దు,
గర్వమొకడైతే  కులం మరొకని పేరు,
మరెందరో ఉన్నారు-కాదువీరు వేరు వేరు!

నవ్వుతూ ధరిద్దాం పెద్దరికపు తలపాగ,
మెరుస్తుంది చీకట్లో బరువులేని ఈ నగ,
స్వతహాగా క్షమిద్దాం ఎంతైనా వెక్కిరింత,
మనసారా పంచిపెడదాం తేలికైన పలుకరింత!

ఇల్లు,రాష్ర్టం,దేశం కాదు నే చెబుతున్నది,
మందిరమనే మనస్సు ఏ ఎల్లలు ఎరుగనన్నది,
ఎదిగినా ఏమి లాభం జీవరాశులు శతకోటి,
'తన' నుండీ 'మన'  దాకా సాగాలి గడప దాటి!

(for సాహితీ శ్రేష్ఠులు writers group)

గరళం (Poison)

విశ్వమంతటిని ఆడించేను నీ లీలా తాళం,
అందున భాగమేగా నీ  గలమునందు గరళం,
కృపతో  నింపావు జీవితాన పరిమళం,
భక్తి ముక్తులను నీ ధ్యానము చేయు సరళం;

అమితమైన అవకాశం మా యందు వాక్తాళం,
కంఠమునందు నిలపాలి మాటలలోని గరళం,
ఇది గ్రహించిన ఇక బ్రతుకులు సరళం,
నీ రూపులు మేమైతే కాదా భువి పరిమళం!

(for సాహితీ శ్రేష్ఠులు writers group)