(ప్రపంచాన్ని మార్చు కిటుకు మన చిటికె లోనే దాగున్నది. స్వాతంత్య్రమనగా మన సన్నని ఆలోచనా సందులను వీడి విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే రహదారిపై పయనించడమే!)
-------------------------------------------------------------
ఒడలు పై ఉన్న ధ్యాస, శ్వాసపై ఎపుడు ఒదుగు?
వేదికపై ఉన్న మోజు తీరునా ఏదోక రోజు?
పాలుగ్రోలి పెరిగినను తుదిన పుడమిపురుగుల పాలే,
విఫలమయ్యిరి విధి వీలునామాన, నేనునేననిన ఘన పాలకులే,
పేరు ఏది? పరివారమేది? తరతరాల తలరాత చూడు,
చెంత చేరిన మనిషి జన్మ జారు లోపే మాయ వీడు,
ఓర్పులేని మాటలాగిన, తెగిన మూటవోలె దొరలు మార్పు,
నీవు మెరిసిన జగతి మురియు, విశ్వభారతికిదియే కూర్పు,
నాలుకపై ఉన్న పదును ప్రణాళికపై పెట్టి చూడు,
వేడి వాడి వార్తలపై క్షీణిస్తున్న క్షణాన్ని చూడు,
కత్తి వలదు, వీరఛాతి వలదు, బండ పోలు కండ వలదు,
కలదు స్థిరసుఖము, పరోపకారమందు, కలతలేని మనసునందు,
ధరణిమాత పట్టు విడువని తగిన తరువై బ్రతుకవలెను,
సుమనస్కుల పట్టుదలలా సత్యనిరతిని చాటవలెను,
నీరు పల్ల మెరుగు నట్టే, సిరి సహన మెరుగు నోయి,
గురి తప్పక చేయు కృషి, ఋషితుల్యము నినుజేయునోయి!